Monday, June 6, 2011

ప్రధమ అవధానం

తేది : 20 -03 -2005
నా ప్రధమ అవధానమును అమలాపురములోని సాహితీ మిత్ర మండలి వారి ఆధ్వర్యములో సాయంత్రం 4 గం లకు ప్రారంభమైనది .

సమస్య : వరియించెన్ గిరిరాజ నందిని వడిన్ వాగీశు ప్రాణేశుగా
ఇచ్చినవారు : శ్రీమతి ఆకెళ్ళ బాలభాను

మత్తేభం    
సురలోకంబట సంతసింపగను సుశ్లోకుండు నౌశంభునిన్
వారియించెన్ గిరి రాజ నందిని వడిన్ వాగీశు  ప్రాణేశుగా
కరముల్ గల్పచు వాణి  యొప్పగను సత్కార్యంబుగా శౌరియున్
సిరితో పెండిలి యాడె లోకములకున్ శ్రేయమ్ము చేకూర్పగన్

దత్తపది : రాజ్యము , పూజ్యము , భోజ్యము , భాజ్యము 
ఇచ్చినవారు : శ్రీ కే బి ఎన్ ఆచార్యులు 

తేటగీతి 
సరస సాహితీ రాజ్యమ్ము సాగనేలు
సుకవి  భోజ్యము నౌచును శోభ జెంద
దేని భాజ్యమ్ము జేసినన్ దేవి చలువ 
వాణి లేకున్న పూజ్యమ్ము పద్య విద్య

వర్ణన : కొబ్బరి నీళ్లు
ఇచ్చినవారు  : శ్రీ పాద సూర్య ప్రకాశ రావు

మత్త కోకిల 
మత్త కోకిల  పాట వోలెను మంజులంబగు రీతిలో  
క్రొత్త శక్తులు నొప్పుచుండగ కూర్మి రోగము బాపుచున్
చిత్తమందున హాయి నింపుచు సేద దాహము దీర్చుచున్
యిత్తు కొబ్బరి  నీటి  నిచ్చట నీవు సంతస మొందగన్

నిషిద్ధాక్షరి : శివ కళ్యాణం 
ఇచ్చినవారు  : శ్రీ  కొక్కెరగడ్డ కామశాస్త్రి గారు 

కందం 
మనసధ్యూడునకియ్యన్ 
యనంత సుఖమాయ.తన మారోగిణమున్
కనకన్ సుమ బాణుని యా
చనవున పెండ్లాడె జగతి సంతస మొందన్

ఆశువు : శరత్కాలపు వెన్నెలలో గోదావరి చూచే కవి ఊహ
ఇచ్చినవారు : వంక మార్కండేయులు 

కందం           
  పున్నమి చంద్రుడు చల్లని 
  వెన్నెల కురిపించుచుండ వింతగా నదిలో 
  కన్నుల నూహలు వెదకుచు
  నెన్నడు నుడువుచు కవి వరులీభువినుండెన్ 

వ్యస్తాక్షరి : లంకాధిపు  వైరి వంటి  రాజుం గలడె
 ఇచ్చినవారు : భావరాజు సుబ్రహ్మణ్యం గారు